తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రివాజుకు భిన్నంగా ప్రధాన ద్రవిడ పార్టీలు రెండింటినీ రెండంకెలకు పరిమితం చేసి, రాజకీయ తెరపైకి విజేతగా దూసుకొచ్చిన సినీ నటుడు విజయ్‌కి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రూపంలో చివరి నిమిషంలోనూ అవరోధాలు ఎదురవుతున్నాయి.
ముఖ్యమంత్రిగా శనివారం ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని తొలుత అనుకున్నా వీసీకే, ఐయూఎంఎల్ లేఖలు రాలేదని అంటున్నారు.దాంతో విజయ్ వరసగా మూడోరోజు గవర్నర్‌ని కలిసినా ఫలితం లేకపోయింది.
సొంతంగా 108 స్థానాలు సాధించి అత్యధిక స్థానాలున్న పార్టీగా ఆవిర్భవించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతిస్తామని అయిదుగురు సభ్యులున్న కాంగ్రెస్ ప్రకటించగా, తాజాగా రెండేసి స్థానాలున్న సీపీఐ, సీపీఎంలు అంగీకారం తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 118 అవసరం కాగా, రెండుచోట్లనుంచి గెలిచిన విజయ్ ఎటూ ఒక స్థానం నుంచి తప్పుకోవాలి గనుక టీవీకే నికర బలం 107. రాజీనామా చేసే స్థానం తమకిస్తేనే లేఖ ఇస్తామని వీసీకే పట్టుబట్టగా, ఐయూఎంఎల్ అసలు లేఖే ఇవ్వలేదంటున్నారు. ఈ అంకెల ఆట ఎలావున్నా, ఆర్లేకర్ తీరు సంప్రదాయాలకు విరుద్ధం. ఈనెల 6న విజయ్ తొలిసారి గవర్నర్‌ను కలిసినప్పుడే ఆ వ్యవహారం ముగియాల్సి ఉండగా ఎందుకనో దీన్నింకా సాగదీస్తున్నారు.
ఎస్‌ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా 'ప్రభుత్వాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లో తప్ప రాజ్ భవన్‌లలో కాద'ని తెలిపింది. ఉన్నవాటిలో మెజారిటీ పొందిన పక్షమేదో గమనించుకుని ఆహ్వానించటం, బల నిరూపణకు గడువీయడం తప్ప గవర్నర్‌కు మరే ప్రత్యామ్నాయమూ లేదు. అందుకు భిన్నంగా వ్యవహరించటం ఎలా చూసినా ధర్మం కాదు. ఇది అనవసర అపోహలు, అనుమానాలకు తావిచ్చింది. కేంద్రం రాష్ట్రంలో అస్థిరత కోరుకుంటున్నదనీ, రాష్ట్రపతి పాలన విధిస్తారనీ వదంతులు వ్యాపించాయి. కొన్ని గంటలపాటు డీఎంకే, ఏఐఏడీఎంకేలు కలుస్తాయన్న పుకార్లు షికార్లు చేశాయి. అలా కలిసినా ఆ పక్షాలు విజయ్ దరిదాపుల్లోకి వచ్చే అవకాశం ఉండదు.
ఈ ఊహాగానాలకు తావిచ్చేలా జాప్యం చేయటం అవసరమా? బలనిరూపణలో విఫలమైతే విజయ్ సర్కారు తప్పుకోవాల్సిరావొచ్చు. దానివల్ల కలిగే కష్టనష్టాలు ఆయన చూసుకుంటారు. ఆ పరిస్థితి ఏర్పడితే టీవీకే తర్వాత స్థానంలోవున్న పార్టీని ఆహ్వానించాలి.అంతేతప్ప లోక్‌భవన్‌లో లెక్కలు వేస్తూ కూర్చోవటం సరికాదు. విజయ్ తమ లేఖతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల లేఖ కూడా ఇవ్వటమే సమస్య తెచ్చిందని కొందరు వాదిస్తు న్నారు. ప్రజల మనోభీష్టం నెరవేర్చేందుకు సాంకేతికపరమైన అంశాలు అభ్యంతరం కావటం సరికాదు.
పొరుగునున్న కర్ణాటకలో కొన్నేళ్లక్రితం బీజేపీకి తక్కువ స్థానాలొ చ్చినా మెజారిటీ స్థానాలున్నాయి గనుక దాన్నే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆ నిర్ణయాన్నెవరూ తప్పుబట్టలేదు. సర్కారియా కమిషన్ సైతం 1988నాటి నివేదికలో ఎన్నికల ముందు ఏర్పడిన కూటములనూ, లేనట్టయితే ఉన్న పక్షాల్లో అత్యధిక స్థానాలొ చ్చిన పార్టీనీ పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది.
ఈ రెండేళ్లలో విజయ్ సాధించిన రాజకీయ అనుభవం సంగతేమోగానీ... ఈ మూడు నాలుగు రోజుల్లో ఆయనకది దండిగానే దక్కింది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ తీరు జుగుప్సాకరంగావుంది. జాతీయస్థాయిలో ఇండియా కూటమికి నాయ కత్వం వహిస్తూ తన భాగస్వామ్యపక్షం తమిళనాట ఓడిపోగానే చేతులు దులుపుకొని బయటకు పోవటం ఏం నీతి? అందువల్ల విజయ్‌కి వీసమెత్తు ప్రయోజనం లేకపోగా, విపక్ష కూటమికి అది చేటు తెస్తుంది. కనీసం సహ భాగస్వామ్యపక్షాలు డీఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎంలనైనా సంప్రదిస్తే మర్యాదగా ఉండేది.
చివరకు సీపీఐ, సీపీఎం వచ్చి చేరాయిగానీ... రాజ్యాంగసంక్షో¿¶ నివారణకే ఆ పనిచేశాయి. ఆ మాత్రం వేచిచూడాలన్న ఇంగితజ్ఞానం లేకపోగా, భవిష్యత్తు ఎన్నికలన్నిటికీ ఈ కొత్త పొత్తు వర్తిస్తుందని ప్రకటించి కాంగ్రెస్ మరింత చులకనైంది. ఒంటరిగా బరిలోదిగి తన సత్తాతో జనాభిమానం చూరగొని మెజారిటీ స్థానాలు పొందిన విజయ్‌కి అవకాశమీయకుండా మీనమేషాలు లెక్కించటం సరికాదు. అది అప్రజాస్వామికం. అన్ని అడ్డంకులూ తొలగి ఆయన ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని, ప్రజాభీష్టం నెరవేరుతుందని ఆశించాలి.

