Nellore
Nellore: నెల్లూరు ధనలక్ష్మిపురంలోని నారాయణ సీబీఎస్‌ఈ రెసిడెన్షియల్ హైస్కూల్ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్‌సీసీ 20వ వార్షిక శిక్షణా శిబిరాన్ని గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ సుధాన్షు దుబే సందర్శించారు.
లెఫ్టినెంట్ కమాండర్, క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో ఫిజికల్ ట్రైనింగ్, డ్రిల్, ఎన్‌సీసీ జనరల్ మరియు స్పెషల్ సబ్జెక్టులతో పాటు హెల్త్ అండ్ హైజిన్, మోరల్ వాల్యూస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, లీడర్‌షిప్, నేవల్ కమ్యూనికేషన్, షిప్ మోడలింగ్, సీమఫోర్, నాట్స్ వంటి అంశాలపై కేడెట్లకు శిక్షణ అందిస్తున్నారు.
కల్నల్ సుధాన్షు దుబే శిబిరాన్ని సందర్శించగా ఎన్‌సీసీ కేడెట్లు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారు. అనంతరం క్యాంపు నిర్వహణ, శిక్షణ విధానాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక సేవా భావాలు అలవరచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం కేడెట్లతో కలిసి భోజనం చేశారు.
ఈ శిబిరంలో గుంటూరు గ్రూప్ పరిధిలోని పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 500 మంది ఎన్‌సీసీ కేడెట్లు పాల్గొన్నారు.

