Rajole
Rajole: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో రాజోలు, మామిడికుదురు మండలాల అభివృద్ధి అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో నూతన గ్రామీణ సీసీ రోడ్ల ప్రతిపాదనలు, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం అమలు, వేసవిలో త్రాగునీటి ఎద్దడి నివారణ చర్యలపై పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో అవసరమైన చోట్ల సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతిపాదనలు స్పష్టంగా ఉండాలని సూచించారు.
ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై గ్రామస్థులకు విస్తృత అవగాహన కల్పించాలని, సోలార్ విద్యుత్ ప్రయోజనాలను వివరించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పథకం అమలుకు కృషి చేయాలని తెలిపారు.
వేసవిలో త్రాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సమాచారం అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
అమరజీవి జలధార ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మంచినీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పేర్కొన్నారు.

