గత కొన్ని సంవత్సరాలుగా ఫ్రీలాన్సింగ్ రంగం వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు చాలా కంపెనీలు పూర్తి సమయ ఉద్యోగుల కంటే ప్రాజెక్ట్ ఆధారిత పనుల కోసం ఫ్రీలాన్సర్లను ఎక్కువగా ఎంపిక చేస్తున్నాయి.
దీనివల్ల వ్యక్తులు తమకు అనుకూలమైన సమయంలో పని చేయడంతో పాటు, ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా క్లయింట్లతో పనిచేసే అవకాశం పొందుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలోని ఐటీ నిపుణులు, కంటెంట్ రైటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, వీడియో ఎడిటర్లు, డిజిటల్ మార్కెటర్లు, వెబ్ డెవలపర్లు ఈ రంగంలో వేగంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో ప్రధాన ఆకర్షణ విదేశీ క్లయింట్లు డాలర్లలో చెల్లింపులు చేయడం. దీంతో భారతీయ ఫ్రీలాన్సర్లు రూపాయల్లో భారీ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. చాలామంది ఉద్యోగంతో పాటు పార్ట్‌టైమ్‌గా ఫ్రీలాన్సింగ్ చేస్తుండగా, మరికొందరు దీన్నే పూర్తి స్థాయి కెరీర్‌గా ఎంచుకుంటున్నారు.Upwork, Fiverr ఎందుకు అంత ప్రాచుర్యం పొందాయి? ఫ్రీలాన్సింగ్ ప్రపంచంలో Upwork, Fiverr అత్యంత విశ్వసనీయమైన మరియు ప్రజాదరణ పొందిన ప్లాట్‌ఫారమ్‌లుగా గుర్తింపు పొందాయి. Upworkలో కంపెనీలు తమ ప్రాజెక్ట్‌లను పోస్టు చేస్తాయి. ఫ్రీలాన్సర్లు వాటికి దరఖాస్తు చేసుకుని పని పొందవచ్చు. కంటెంట్ రైటింగ్, ప్రోగ్రామింగ్, డిజైనింగ్, అకౌంటింగ్, మార్కెటింగ్ వంటి వేలాది పనులు ఇందులో అందుబాటులో ఉంటాయి.
Fiverr మాత్రం కొంత భిన్నమైన విధానంలో పనిచేస్తుంది. ఇందులో ఫ్రీలాన్సర్లు తమ సేవలను "Gig" రూపంలో ప్రొఫైల్‌గా రూపొందిస్తారు. క్లయింట్లు నేరుగా ఆ సేవలను కొనుగోలు చేయవచ్చు. చిన్న ప్రాజెక్ట్‌లతో ప్రారంభించాలనుకునే వారికి Fiverr సులభమైన వేదికగా భావిస్తారు. సమయానికి పని పూర్తి చేసి మంచి రేటింగ్స్ సంపాదిస్తే, తర్వాత పెద్ద క్లయింట్లు కూడా లభించే అవకాశం ఉంటుంది. Upwork, Fiverrతో పాటు Freelancer, Toptal, PeoplePerHour వంటి ప్లాట్‌ఫారమ్‌లు కూడా వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. Freelancerలో డేటా ఎంట్రీ నుంచి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వరకు పలు రకాల ప్రాజెక్ట్‌లు లభిస్తాయి. కొత్తవారికి చిన్న పనులు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. Toptalను అధిక నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌కు అనువైన ప్లాట్‌ఫారమ్‌గా భావిస్తారు. ఇందులో ఎంపిక ప్రక్రియ కాస్త కఠినంగా ఉంటుంది. కానీ ఒకసారి ప్రొఫైల్ ఆమోదం పొందితే, పెద్ద అంతర్జాతీయ కంపెనీలతో పని చేసే అవకాశం లభిస్తుంది. PeoplePerHour ప్రధానంగా యూరప్ కంపెనీల్లో ప్రసిద్ధి పొందింది. డిజైనింగ్, కంటెంట్ క్రియేషన్, టెక్నికల్ స్కిల్స్ ఉన్న వారికి ఇది మంచి ఆదాయం అందించే వేదికగా మారుతోంది.

